"కాంగ్రెస్ లో ఆ 7 కుటుంబాలు" అన్న వార్తా శీర్షిక... ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ అంతర్గత వ్యవహారం మాత్రమే కాదు, మన దేశ రాజకీయాల్లో లోతుగా పాతుకుపోయిన, కుళ్లిపోయిన వ్యవస్థాగత లోపానికి నిలువుటద్దం. అధికారం అన్నది ప్రజల సేవకు లభించే బాధ్యత కాకుండా, వంశపారంపర్యంగా సంక్రమించే ఒకానొక 'కుటుంబ వ్యాపారం'గా మారిపోయిన దుస్థితిని ఇది స్పష్టం చేస్తోంది. ఏళ్ళ తరబడి, కొన్ని నిర్ణీత కుటుంబాలే అధికార పీఠాలను అంటిపెట్టుకుని ఉంటే, నిజమైన కార్యకర్తకు, ప్రజా సేవకుడికి, సామాన్య పౌరుడికి అవకాశం ఎక్కడిది? 'పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం' అనే మాట కేవలం ఎన్నికల ప్రచారాలకే పరిమితమై, ఆచరణలో అడుగంటిపోయింది. ఇటువంటి పరిస్థితి కేవలం ఒక పార్టీకి మాత్రమే పరిమితం కాదన్నది బహిరంగ రహస్యం. ఇది మన ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకే పెను సవాలు విసురుతోంది.
ఈ దుస్థితికి కేవలం రాజకీయ నాయకులను, పార్టీలను మాత్రమే వేలెత్తి చూపడం మన ఆత్మవంచనే అవుతుంది. ఎన్నికల సమయంలో నోట్ల కట్టలకు, మద్యాన్ని పంచిపెట్టే నాయకుడికి ఆశపడి, తమ ఐదేళ్ల భవిష్యత్తును ఐదు వందల నోటుకు తాకట్టు పెడుతున్న ఓటరు బాధ్యత లేదా? కులం, మతం, ప్రాంతం వంటి సంకుచిత భావజాలాలకు, ఆ క్షణికావేశపు స్వార్థ ప్రయోజనాలకు లొంగి, ఎవరు నిజమైన ప్రజా సేవకుడు, ఎవరు ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టగలరు అని ఆలోచించకుండా, అడ్డగోలుగా ఓటు వేస్తున్న ప్రతి పౌరుడూ ఈ వారసత్వ రాజకీయాలకూ, కుటుంబ పాలనకూ పరోక్షంగా ఊతమిస్తున్నట్లే కదా? తమ చేతుల్లో ఉన్న పవిత్రమైన ఓటు హక్కును విలువైన ఆయుధంగా కాకుండా, బేరమాడే వస్తువుగా మార్చుకుంటున్నప్పుడే, ఈ రాజకీయ కలుషితం మరింత విస్తరిస్తుంది. ప్రజాస్వామ్య పునాదులను పటిష్టం చేయాలంటే, ఓటరు విజ్ఞత, నిబద్ధత అత్యంత ముఖ్యం.
వోటు కేవలం హక్కు కాదు.. బాధ్యత కూడా!