ఈ మధ్య కాలంలో తెలంగాణ రాజకీయాలు వ్యక్తిగత దూషణలకు, అసంబద్ధ వ్యాఖ్యలకు వేదికగా మారుతున్న తీరు ఆందోళనకరం. 'కేసీఆర్ చెప్పుకు ఉన్న ధూళికి కూడా సమానం కాలేవు' వంటి వ్యాఖ్యలు ప్రజా సమస్యలను పక్కనపెట్టి, నాయకుల మధ్య వైషమ్యాలను పెంచుతున్నాయి. మూడు దశాబ్దాలుగా ఈ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న నాకు, ఇలాంటి మాటలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని, ప్రజల విశ్వాసాన్ని ఏ విధంగా దెబ్బతీస్తాయో తెలుసు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ, పాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం వంటి అసలు చర్చలు పక్కకు పోయి, నాయకుల అహాలు, వారి వ్యక్తిగత కీచులాటలే ప్రధానమవుతున్నాయి. అధికారంలో ఉన్నవారు కానీ, ప్రతిపక్షంలో ఉన్నవారు కానీ – ఎవరు కూడా ఈ కిందిస్థాయి రాజకీయాలకు అతీతులు కావడం లేదు. ప్రజలు ఈ డ్రామాను మౌనంగా గమనిస్తూనే ఉన్నారు.
ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలక అంశం ఏమిటంటే, నాయకులు ఎంతటి పెద్ద మాటలు మాట్లాడినా, ఎంత బురద చల్లుకున్నా, చివరకు నిర్ణయాధికారం ప్రజల చేతుల్లోనే ఉంటుంది. తమ నాయకుల మధ్య జరిగే మాటల యుద్ధాలు చూసి ప్రజలు ఉద్వేగానికి లోనై, తమ వివేకాన్ని కోల్పోకూడదు. పదునైన విమర్శలు, హామీలు, పాలసీల గురించి చర్చించాల్సిన వేదికలు, ఇలా ఒకరిపై ఒకరు బురద కుమ్ముకునే ప్రదేశాలుగా మారినప్పుడు, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం పంపిణీ ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు విచ్చలవిడిగా జరుగుతాయి. ఇలాంటి జిమ్మిక్కులకు లొంగిపోయి, క్షణికావేశంలోనో, స్వల్ప ప్రయోజనాల కోసమో తమ విలువైన ఓటును అమ్ముకుంటే, అది మన భవిష్యత్తును మనమే అమ్ముకున్నట్టే. మన తరం, భావితరాల భవిష్యత్తును నిర్ణయించే ఆ పవిత్రమైన ఓటును కేవలం ఒక హక్కుగా చూడకుండా, దానిని ఒక బాధ్యతగా గుర్తించాలి. ఓటు కేవలం హక్కు కాదు.. బాధ్యత కూడా!
- ఆర్కే మాలిగ, జర్నలిస్ట్
స్పందనలు (0)
మొదటి కామెంట్ మీరే పెట్టండి!